జవాబు: సూరతు తకాసుర్ మరియు దాని తఫ్సీర్ (వ్యాఖ్యానం):
అనంత కరుణాప్రధాత మరియు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో,
(ఇహలోక) పేరాస మిమ్మల్ని ఏమరు పాటులో పడవేసింది 1 మీరు గోరీలలోకి చేరే వరకు.2 అలా కాదు! త్వరలోనే మీరు తెలుసు కుంటారు.3 మరొకసారి (వినండి)! వాస్తవంగా, మీరు అతి త్వరలోనే తెలుసుకుంటారు.4 ఎంత మాత్రము కాదు! ఒకవేళ మీరు నిశ్చిత జ్ఞానంతో తెలుసుకొని ఉంటే (మీ వైఖరి ఇలా ఉండేది కాదు).5 నిశ్చయంగా, మీరు భగభగ మండే నరకాగ్నిని చూడగలరు! 6 మళ్ళీ అంటున్నాను! మీరు తప్పక దానిని (నరకాగ్నిని) నిస్సంకోచమైన దృష్టితో చూడగలరు!7 అప్పుడు, ఆ రోజు మీరు (ఈ జీవితంలో అనుభవించిన) సౌఖ్యాలను గురించి తప్పక ప్రశ్నించబడతారు! 8 [సూరతుత్తకాసుర్: 1-8వ ఆయతులు]
తఫ్సీర్ (వ్యాఖ్యానము):
1 - (అల్ హాకుముత్తకాసుర్) 1 : ఓ ప్రజలారా! సంపదల పట్ల,సంతానం పట్ల ప్రగల్భాలు పలకటం మిమ్మల్ని అల్లాహ్ విధేయత నుండి పరధ్యానంలో పడవేసింది.
2 - (హత్తా జుర్'తుముల్ మఖాబిర్) 2 : మీరు చనిపోయి మీ సమాధులలోకి ప్రవేశించే వరకు.
3 - (కల్లా సౌఫ తఅలమూన్) 3 : వాటి పట్ల ప్రగల్భాలు పలకటం అల్లాహ్ విధేయత నుండి మిమ్మల్ని పరధ్యానంలో పడవేయటం మీకు సరి కాదు. ఈ పరధ్యానం యొక్క పర్యవసానం ఏమిటో మీరు తొందరలోనే తెలుసుకుంటారు.
4 - (సుమ్మ కల్లా సౌఫ తఅలమూన్) 4 : అప్పుడు మీరు దాని పర్యవసానాన్ని తెలుసుకుంటారు.
5 - (కల్లా లౌ తఅలమూన ఇల్మల్ యఖీన్) 5 : వాస్తవం ఒక వేళ మీరు అల్లాహ్ వైపు మరల లేపబడి వెళతారని మరియు ఆయన మీకు మీ కర్మల ప్రతిఫలం ప్రసాదిస్తాడని మీరు ఖచ్చితంగా తెలుకుని ఉంటే సంపదల పట్ల,సంతానం పట్ల ప్రగల్భాలు పలకటం ద్వారా మీరు పరధ్యానంలో పడేవారు కాదు.
6 - (లతరవున్నల్ జహీమ్) 6: అల్లాహ్ ప్రమాణంగా తీర్పు రోజున మీరు ఖచ్చితంగా నరకాగ్నిని చూస్తారు.
7 - (సుమ్మ లతరవున్నహా ఐనల్ యఖీన్) 7 : మళ్ళీ (చెబుతున్నాను), మీరు దానిని సంపూర్ణ నిశ్చయతతో చూస్తారు.
8 - (సుమ్మ లతుస్'అలున్న యౌమఇజిన్ అని న్నయీమ్) 8 : ఆ తరువాత అల్లాహ్ ఆ దినమున మీకు అనుగ్రహించిన ఆరోగ్యము,ఐశ్వర్యము,ఇతర వాటి గురించి మీకు తప్పకుండా అడుగుతాడు.