1:సూరతుల్ ఫాతిహా పఠించండి మరియు దానిని వివరించండి?

జవాబు: సూరతుల్ ఫాతిహా మరియు దాని తఫ్సీరు (వ్యాఖ్యానం)

అనంత కరుణాప్రధాత మరియు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో, (1) సకల ప్రశంసలు, కృతజ్ఞతలు సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే శోభిస్తాయి. (2) అనంత కరుణాప్రధాత, అపార కృపాశీలుడు. (3) తీర్పుదినానికి యజమాని.(4) మేము కేవలం నిన్ను మాత్రమే ఆరాధిస్తాము మరియు కేవలం నిన్ను మాత్రమే సహాయం కొరకు అర్థిస్తాము.(5) మాకు ఋజుమార్గము చూపించు.(6) నీవు అనుగ్రహించిన వారి మార్గము మాత్రమే (చూపించు); నీ ఆగ్రహానికి గురి అయిన వారి మరియు మార్గభ్రష్టులైన వారి (మార్గం) కాదు.(7) [సూరతుల్ ఫాతిహ : 1-7]

తఫ్సీర్ (వ్యాఖ్యానము):

ఇది పవిత్ర ఖుర్ఆన్ ప్రారంభ సూరహ్ కాబట్టి దీనికి సూరతుల్ ఫాతిహా (తొలి అధ్యాయం) అనే ఈ పేరు పెట్టారు.

బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్ 1 - అల్లాహ్ పేరిట నేను ఖుర్ఆన్ పఠించడం ప్రారంభిస్తున్నాను. ఆయన సహాయం కోరుతూ, ఆయన నామమును ప్రస్తావించడం ద్వారా ఆయన దీవెనలు కోరుతున్నాను.

అల్లాహ్ - నిజంగా సకల ఆరాధనలకు ఏకైక అర్హుడు. సర్వశక్తిమంతుడైన ప్రభువుకు తప్ప మరెవ్వరికీ ఆ నామము ఇవ్వబడలేదు.

అర్రహ్మాను - కరుణాప్రధాత: సమస్తాన్ని ఆవరించి ఉన్న మహోన్నతమైన మరియు సువిశాలమైన అపార కారుణ్యం కలిగి ఉన్నవాడు.

అర్రహీమ్: విశ్వాసులపై ప్రత్యేక కృపాకటాక్షాలు కురిపించేవాడు.

2 - అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్: అన్ని రకాల ప్రశంసలు మరియు పరిపూర్ణత అల్లాహ్ కు మాత్రమే చెందుతాయి.

3 - అర్రహ్మా నిర్రహీమ్: సృష్టిలోని ప్రతిదానిని ఆవరించేటంతటి విస్తృతమైన దయాదాక్షిణ్యాలు గలవాడు మరియు విశ్వాసులపై ప్రత్యేక దయను ప్రసాదించేవాడు.

4 - మాలికి యౌమిద్దీన్: ఇది తీర్పు దినాన్ని సూచిస్తుంది.

5 - ఇయ్యాక నఆబుదు వ ఇయ్యాక నస్తయీన్: మేము కేవలం నిన్ను మాత్రమే ఆరాధిస్తాము మరియు సహాయం కొరకు కేవలం నిన్ను మాత్రమే అర్థిస్తాము.

6 - ఇహ్'ది నశ్శిరాతల్ ముస్తఖీమ్: ఇది ఇస్లాం మరియు సున్నతుల వైపునకు మార్గదర్శకత్వాన్ని సూచిస్తుంది

7 - శిరాతల్లదీన అన్అమ్'త అలైహిమ్ గైరిల్ మగ్'దూబి అలైహిమ్ వలద్'దాల్లీన్: అల్లాహ్ యొక్క శాపానికి గురైన క్రైస్తవులు మరియు అల్లాహ్ యొక్క ఆగ్రహానికి గురైన యూదుల మార్గానికి భిన్నమైన మార్గము, ప్రవక్తలు, వారి అనుచరులు, అల్లాహ్ యొక్క నీతిమంతులైన దాసులు నడిచిన మార్గం.

సూరతుల్ ఫాతిహా చదివిన తర్వాత "ఆమీన్" (మా ప్రార్థన స్వీకరించు!) అని పలకడం సున్నతు.