15వ ప్రశ్న: ఈమాన్ (విశ్వాసం) యొక్క మూలనియమాల గురించి వివరించండి?

జవాబు: మహోన్నతుడైన అల్లాహ్ పై విశ్వాసం:

మిమ్మల్ని సృష్టించిన, మిమ్మల్ని పోషిస్తున్న, ఇంకా సకల సృష్టిరాశుల యజమాని మరియు నిర్వాహకుడు అయిన అల్లాహ్ ను మాత్రమే విశ్వసించుట.

మరియు ఆయనే ఆరాధ్యుడు. నిజానికి, ఆయన తప్ప మరెవ్వరూ ఆరాధ్యులు లేరు.

మరియు ఆయన సర్వశక్తిమంతుడు, గొప్పవాడు, సంపూర్ణుడు, సకల ప్రశంసలు ఆయనకే శోభిస్తాయి, అత్యంత సుందరమైన దివ్యనామాలు మరియు దివ్యమైన సుగుణాలు ఆయనకే చెందుతాయి. ఆయనకు సాటి ఎవ్వరూ లేరు. ఆయనను పోలిన వారెవ్వరూ లేరు. ఆయనలో ఎలాంటి లోపాలూ, కొరతలూ లేవు.

దైవదూతల పై విశ్వాసం:

కేవలం తనను మాత్రమే ఆరాధించడానికి మరియు తన ఆజ్ఞలను మాత్రమే పూర్తిగా అనుసరించేందుకు, అల్లాహ్ కాంతి నుండి సృష్టించిన గొప్ప సృష్టిరాశులే దైవదూతలు.

వారిలో జిబ్రయీల్ అలైహిస్సలామ్ ఒకరు. ఆయన ప్రవక్తలకు, సందేశహరులకు ప్రత్యక్షంగా దైవసందేశాన్ని అందిస్తారు.

దైవగ్రంధాల పై విశ్వాసం:

ఉదాహరణకు అల్లాహ్ తన సందేశహరులపై అవతరింప జేసిన గ్రంధాలు.

ఖుర్ఆన్ గ్రంధం: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరింప జేయబడింది.

ఇంజీలు గ్రంధం ప్రవక్త ఈసా అలైహిస్సలాం పై అవతరింప జేయబడింది.

తౌరాతు గ్రంధం ప్రవక్త మూసా అలైహిస్సలాం పై అవతరింప జేయబడింది.

జబూర్ గ్రంధం ప్రవక్త దూవూద్ అలైహిస్సలాం పై అవతరింప జేయబడింది.

సహీఫ ఇబ్రాహీమ్ మరియు మూసా (అలైహిమ స్సలాం): ప్రవక్త ఇబ్రాహీమ్ మరియు మూసా అలైహిమస్సలాంల పై అవతరింప జేయబడినాయి.

దైవసందేశహరుల పై విశ్వాసం:

మరియు తన దాసులకు (ధర్మం) బోధించడానికి, మంచితనం మరియు స్వర్గానికి సంబంధించిన శుభవార్తలను అందించడానికి, ఇంకా చెడు మరియు నరకం నుండి వారిని హెచ్చరించడానికి అల్లాహ్ తన సందేశహరులను ఉద్భవింపజేసాడు.

మరియు వారిలో ఉత్తములు మరియు దృఢసంకల్పం గల కొందరు సందేశహరులు:

నూహ్ అలైహిస్సలాం.

ఇబ్రాహీమ్ అలైహిస్సలాం.

మూసా అలైహిస్సలాం.

ఈసా అలైహిస్సలాం.

ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం

ప్రళయదినం పై విశ్వాసం:

ప్రళయదినంపై విశ్వాసం అంటే సమాధిలోని మరణానంతరం జీవితంపై విశ్వాసం ఉదాహరణకు ప్రళయదినం, పునరుత్థాన దినం, అంతిమ తీర్పుదినం, చివరికి శాశ్వతంగా స్వర్గవాసులు స్వర్గంలోని తమ స్థానాల్లో మరియ నరకవాసులు నరకంలోని తమ స్థానాల్లో చేరటంపై విశ్వాసం.

6) అల్ ఖదర్ (విధివ్రాత)పై విశ్వాసం:

అల్ ఖదర్: విశ్వంలో జరిగే ప్రతిదీ అల్లాహ్ కు తెలుసు అనీ, ఆయన ఆ జ్ఞానాన్ని దానిని అత్యంత సురక్షితంగా భద్రపరచబడిన ‘అల్ కితాబ్’ అనే దివ్యగ్రంధంలో లిఖించి ఉంచాడని, దాని ఉనికి ఆయన ఇష్టానుసారమే ఉందని మరియు దానిని ఆయనే సృష్టించాడని విశ్వసించుట.

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : "నిశ్చయంగా మేము ప్రతి దానినీ నిర్ణీత పరిమాణములో సృష్టించాము." [సూరతుల్ ఖమర్ 49]

అది నాలుగు స్థాయిలలో జరిగింది:

మొదటిది: మహోన్నతుడైన అల్లాహ్ యొక్క మహాద్భుత జ్ఞానము. ప్రతిదీ సంభవించక ముందు మరియు సంభవించిన తర్వాత విషయాల గురించి తన అపూర్వ జ్ఞానం వలన ఆయన ముందే ఎరుగును.

దీనికి సాక్ష్యం: మహోన్నతుడైన అల్లాహ్ యొక్క వాక్కు: నిశ్చయంగా, ఆ (అంతిమ) ఘడియ యొక్క జ్ఞానము కేవలం అల్లాహ్ కు మాత్రమే ఉంది. మరియు ఆయనే వర్షాన్ని కురిపించేవాడు మరియు గర్భాలలో ఉన్నదాని విషయం తెలిసినవాడు. మరియు తాను రేపు ఏమి సంపాదిస్తాడో, ఏ మానవుడు కూడా ఎరుగడు. మరియు ఏ మానవుడు కూడా తాను ఏ భూభాగంలో మరణిస్తాడో కూడా ఎరుగడు. నిశ్చయంగా, అల్లాహ్ మాత్రమే సర్వజ్ఞుడు, సమస్తమూ తెలిసినవాడు (ఎరిగినవాడు). [సూరతు లుఖ్మాన్: 34వ ఆయతు]

రెండవది: దీనిని అల్లాహ్ సురక్షితంగా భద్రపరచబడిన ‘అల్ కితాబ్’ అనే మహాద్భుత గ్రంధంలో లిఖించాడు. కాబట్టి జరిగినదీ మరియు జరగబోయేదీ ప్రతిదీ ఆయన అందులో నమోదు చేసి ఉంచాడు.

దీనికి సాక్ష్యం: మహోన్నతుడైన అల్లాహ్ వాక్కు: {మరియు అగోచర విషయాల తాళపు చెవులు ఆయన (అల్లాహ్) వద్దనే ఉన్నాయి. వాటిని, ఆయన తప్ప మరెవ్వరూ ఎరుగరు. మరియు భూమిలోనూ, సముద్రంలోనూ ఉన్నదంతా ఆయనకు తెలుసు. మరియు ఆయనకు తెలియకుండా ఏ చెట్టు ఆకు కూడా రాలదు మరియు భూమిలోని చీకటి పొరలలో ఉన్న ప్రతి గింజా, అది పచ్చిది కానీ ఎండినది కానీ, అంతా స్పష్టంగా ఒక గ్రంధంలో (వ్రాయబడి) ఉంది.}[59] [సూరతుల్ అన్ఆమ్: 59వ ఆయతు]

మూడవది: ప్రతిదీ అల్లాహ్ యొక్క చిత్తం ద్వారా మాత్రమే జరుగుతుంది మరియు ఆయన సృష్టిలోనిదేదీ ఆయన ఇష్టానుసారంగా కాకుండా జరగదు.

దీనికి సాక్ష్యం: మహోన్నతుడైన అల్లాహ్ వాక్కు: మీలో, ఋజుమార్గంలో నడవదలచుకున్న ప్రతివాని కొరకు. మరియు సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ తలచనంత వరకు, మీరు తలచినంత మాత్రాన ఏమీ కాదు. [సూరతు అత్తక్వీర్: 28-29వ ఆయతులు]

నాల్గవది: మొత్తం సృష్టిలోని జీవరాశులన్నీ అల్లాహ్ చే సృష్టించబడిన జీవరాశులు అని విశ్వసించుట. ఆయనే వాటి ఆత్మలనూ, గుణగణాలనూ, కదలికలనూ మరియు వాటిలో ఉన్న ప్రతిదాన్నీ సృష్టించాడు.

దీనికి సాక్ష్యం: మహోన్నతుడైన అల్లాహ్ యొక్క వాక్కు: "వాస్తవానికి, మిమ్మల్నీ మరియు మీరు చేసిన (చెక్కిన) వాటినీ సృష్టించింది అల్లాహ్ యే కదా!" [సూరతు అస్సాఫ్ఫాత్: 96]