10వ ప్రశ్న: తౌహీద్ విభాగాలు ఎన్ని?

జవాబు: తౌహీద్ మూడు భాగాలలో విభజింపబడినది. మొదటిది తౌహీద్ రుబూబియ్యహ్ (విశ్వాసంలో ఏకత్వం): కేవలం అల్లాహ్ మాత్రమే సమస్త సృష్టిరాశుల సృష్టికర్త, ప్రధాత, యజమాని మరియు వ్యవహారాలను నిర్వహించేవాడని నమ్ముట.

రెండవది తౌహీద్ ఉలూహియ్యహ్ (ఆరాధనలలో ఏకత్వం): సకల ఆరాధనలు కేవలం అల్లాహ్ కు మాత్రమే ప్రత్యేకించుట అంటే, సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ను తప్ప మరెవ్వరినీ ఆరాధించకుండా ఉండుట.

ఇక మూడవది తౌహీద్ అస్మా వ సిఫ్ఫాత్ (దివ్యనామాలు మరియు దివ్యగుణాలలో ఏకత్వం): ఖుర్ఆన్ మరియు సున్నతులలో తమ్'సీల్ (అల్లాహ్ మరియు ఆయన సృష్టి మధ్య సారూప్యతను కల్పించుట), తష్'బీహ్ (అల్లాహ్ ను ఆయన సృష్టితో పోల్చుట), లేదా త’అతీల్ (నిరాకరించుట, తిరస్కరించుట) మొదలైన వాటికి తావు లేకుండా అల్లాహ్ యొక్క దివ్యనామాలు మరియు దివ్యగుణాలను విశ్వసించడం అని దీని అర్థం.

మూడు రకాల తౌహీదులకు సంబంధించిన ప్రామాణిక ఆధారం: మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన: "ఆకాశాలకూ, భూమికీ మరియు వాటి మధ్యనున్న సమస్తానికీ ఆయనే ప్రభువు. కావున మీరు ఆయననే ఆరాధించండి మరియు ఆయన ఆరాధన పైనే స్థిరంగా ఉండండి. నీకు తెలిసినంత వరకు ఆయనకు సాటి గలవాడు ఎవడైన ఉన్నాడా?" [సూరతు మర్యమ్ : 65వ ఆయతు]